Chandrababu: "ఏపీకి వృద్ధి దారిలో నడుస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్..! 1 y ago
AP : టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది స్వార్థ ప్రయోజనాల కోసం కాదన్నారు సీఎం చంద్రబాబు. దగాబడిన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తీసుకొస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు.
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననడం సరికాదన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాము కాదని ప్రజలని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. పింఛన్ల రూపంలో ఏటా రూ. 34 వేల కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని భావించామన్నారు.
పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను వైసీపీ మూసేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 203 అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించామని చెప్పారు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి నగదు జమ చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది 16,384 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.